Jagan Sarkar's sweet talk for poor children..25 percent seats
mictv telugu

పేద పిల్లలకు జగన్ సర్కార్ తీపికబురు..25శాతం సీట్లు

August 5, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇక నుంచి ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయడానికి సిద్దమైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ముందుగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారని, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపులు చేపడతారని పేర్కొన్నారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ, జీవో 129లో సవివర మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నామని పేర్కొంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు.

”2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుంది. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచాం” అని విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.