పది ఫెయిలైన విద్యార్థులకు జగన్ తీపికబురు - MicTv.in - Telugu News
mictv telugu

పది ఫెయిలైన విద్యార్థులకు జగన్ తీపికబురు

July 1, 2022

ఆంధ్రప్రదేశ్‌లో పది ఫెయిల్ అయిన విద్యార్థులకు జగన్ ప్రభుత్వం ఓ తీపికబురు చెప్పింది. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, వారిని ‘కంపార్ట్‌మెంట్’ అని కాకుండా ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తామని తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులుగా మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కులు ప్రకారం డివిజన్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు. కానీ, ఈ ఒక్క విద్యాసంవత్సరమే ఇది వర్తిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 6వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన పది ఫలితాలలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా విద్యాశాఖ అధికారులు ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లను కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

మరోపక్క జూలై 6 నుంచి 15వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సిన రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. ఈసారి రెగ్యులర్‌ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్‌మెంట్‌ పరీక్షల విధానం లేదు. దీనికితోడు ఫెయిల్ అయిన విద్యార్థులు ఈసారి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైతే వారిని రెగ్యూలర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుగానే రాష్ట్ర ప్రభుత్వం పరిగణించనుంది.