ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది. జీవో ప్రకారం.. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ, జీవోఎంఎస్ నెంబర్ 5ను విడుదల చేసింది.
గతంలో సచివాలయాల ఉద్యోగులు, తమ జీతాలను పెంచాలని, ప్రొబేషన్‌పై పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలను అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఈరోజు జారీ చేసిన జీవోలో పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే స్కేలు రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా, ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే స్కేలు రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది.
మరోపక్క జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారమే 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల (ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఈ సచివాలయాల ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ఆత్మకూరులో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో మే నెలంతా నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ కారణంగానే సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని అధికారులు తెలిపారు.