ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాయశక్తులా శ్రమించి టీడీపీని కూకటివేళ్లతో సహా పెకలించాలని కోరారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. నవంబర్ 2 నుంచి నిర్వహించే పాదయాత్ర ఏర్పాట్లను సమీక్షించారు.

6 నెలలు.. 3 వేల కిలోమీటర్లు

జగన్ 6 నెలలపాటు  3వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. మొత్తం 120 నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. పార్టీ ఎంపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు. 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కూడా జగన్ చేపడతారని వెల్లడించారు. దీనిపై బుధవారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో జగన్ చర్చించారని వెల్లడించారు. జగన్ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాల సాధన కోసం పోరాడుతున్నారని, ప్రజలు ఆయనకు ఒక అవకాశమివ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పుడే రాజీనామా చేస్తామని మేకపాటి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అతనికి ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారన్నారు.

SHARE