ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి గుంటూరులో ప్రారంభం కానున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే ఈ సమావేశాలు రెండురోజుల పాటు జరుగనున్నాయి. సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి నేరుగా ప్లీనరీ సమావేశానికి రానున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయం వినవస్తోంది. ఆ పార్టీకి ఇప్పటివరకు వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అటు షర్మిల పార్టీ వైఎస్సార్టీపీకి కూడా ఆమెనే గౌరవాధ్యక్షురాలిగగా ఉన్నారు. దీంతో ఎన్నికల నియమావళి ప్రకారం ఇది విరుద్ధం కాబట్టి వైసీపీ నుంచి విజయమ్మను తప్పించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ఇందుకోసం పార్టీ రాజ్యంగంలో సవరణ చేయనున్నారు. ప్రతీ ప్లీనరీలో అధ్యక్షుడిగా జగన్ను ఎన్నుకునే ప్రక్రియకు మంగళం పాడనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం వెల్లడించారు. ప్లీనరీ ముగిసే శనివారం రోజు ఈ విషయానికి సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.