Jagan will give e-scooters to government and private employees
mictv telugu

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు జగన్ శుభవార్త..ఈ-స్కూటర్లు అందజేత

September 14, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ శుభవార్తను చెప్పింది. ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈ-స్కూటర్)లను వాయిదాల పద్దతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, త్వరలోనే ఈ-స్కూటర్లు అందించేందుకు సన్నహాలు చేస్తున్నామని, తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనున్నామని మంగళవారం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

”రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నవారికి తొలుత ఈ స్కూటర్లను అందజేస్తాం. కొనుగోలు చేసిన ఈ-స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ-స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు ఉద్యోగులకు విక్రయిస్తాం. ఈ వాహనాల ద్వారా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు. త్వరలో జిల్లాకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది. వివరాలకు నెడ్ కాప్ డీఎంను 9000550972, డీఓను 9989949144 నంబర్లలో సంప్రదించవచ్చు” అని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ఇక, రాష్టవ్యాప్తంగా ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకసారి కారుకు రీచార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంటుంది. ఇప్పటి వరకూ కారుకు 6 గంటల పాటు చార్జ్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం 45 నిమిషాల్లోనే చార్జ్ చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రాజమహేంద్రవరంలో టాటా సంస్థ రెండు చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. మిగతా వాటి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.