చిన్నారి ‘వెలివేత’ లేఖకు స్పందించిన జగన్
‘జగనన్నా మమ్మల్ని కాపాడండి.. మా కుటుంబాన్ని ఊరు వెలేసింది..మీరే న్యాయం చేయాలి’ అని నాల్గవ తరగతి చదువుతున్న ఓ చిన్నారి రాసిన లేఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ, వైసీపీ నాయకుడు కోడూరు వెంకటేశ్వరరావుకు, గ్రామపెద్దలకు మధ్య భూమి విషయంలో మూడు నెలల క్రితం వివాదం మొదలైంది.పంచాయితీ నిర్వహించిన గ్రామ కాపులు మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని బహిష్కరించారు. వారితో ఎవరు మాట్లాడినా రూ. 10వేలు జరిమానా విధిస్తామని తీర్పు చెప్పారు. పాఠశాలలో చదువుకుంటున్న వారి పిల్లలతో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదని నిబంధన విధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామపెద్దల తీరుకు మనసు నొచ్చుకున్నవెంకటేశ్వరెడ్డి కుమార్తె కోడూరి పుష్ప ముఖ్యమంత్రికి లేఖ రాసింది. జగన్ స్పందించారు. ఈ లేఖను ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు పంపించారు. తక్షణమే గ్రామాన్ని సందర్శించి విచారణ చేయాలని ఆదేశించారు. తనను ఊరు నుంచి అకారణంగా బయటకు పంపేశారంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు జులై 22న ప్రకాశం కలెక్టరేట్ ఎదుట ఆందోళన దిగారు. కాపుల తీర్పు మేరకు పిల్లలను బడికి దూరంగా ఉంచిన గ్రామస్థులు అధికారుల జోక్యంతో తిరిగి పాఠశాలకు పంపుతున్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడి మనుమడు, మనుమరాళ్లతో మాట్లాడకూడదని షరతు పెట్టారు. అదేసమయంలో అతని కుటుంబ సభ్యులతో ఎవ్వరూ మాట్లాడకూడదని కులపెద్దలు తీర్మానించారు. దాన్ని పాటించనివారికి రూ.10వేల జరిమానా విధించాలని నిర్ణయించడాన్ని ఆ లేఖలో అతని మనుమరాలైన చిన్నారి ప్రస్తావించింది.