బీజేపీ కొత్త బాస్‌గా జేపీ నడ్డా ఏకగ్రీవం - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ కొత్త బాస్‌గా జేపీ నడ్డా ఏకగ్రీవం

January 20, 2020

JP Nadda

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా(జేపీ నడ్డా) సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జేపీ నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధా మోహన్‌ సింగ్‌ నియామక పత్రాన్ని అందించారు. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రలతో నడ్డా సమావేశం కానున్నారు. 

రాజకీయాల్లో నడ్డాది సుదీర్ఘమైన అనుభవం. విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. పలు కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2014 నుంచి 2019 వరకు మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్‌ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది.