పీఈటీ కొమురయ్య విజయగాథ.. తప్పకుండా చూడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

పీఈటీ కొమురయ్య విజయగాథ.. తప్పకుండా చూడండి..

October 10, 2018

చాలామందికి వృత్తి అంటే ఏదో పొట్టకూటి కోసం చేసే పని మాత్రమే. అది కూడా ప్రభుత్వ ఉద్యోగమైతే అసలు పట్టింపే ఉండదు. వెళ్లామా, వచ్చామా, సెలవులన్నీ వాడుకున్నామా, జీతం తీసుకున్నామా అన్నట్లు ఉంటుంది. కానీ అందరూ అలా ఉండరు. అంకిత భావంతో పనిచేసేవారూ ఉంటారు. పదిమందికి ఆదర్శంగా నిలిచేవారూ ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు వ్యాయామ ఉపాధ్యాయుడు కొమురయ్య.

కొమురయ్య జగిత్యాల జిల్లా వేంపేట్ ప్రభుత్వ పాఠశాల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. ఆయన జీవితం కష్టాల నుంచి మొదలైంది. చదువు మధ్యలోనే ఆగిపోయింది. కుటుంబ పోషణ కోసం పీఈటీ శిక్షణ తీసుకుని ఉద్యోగం సంపాదించారు. పీఈటీగా కేవలం స్కూలుకే పరిమితం కాకుండా పిల్లలతో అనుబంధం పెంచుకున్నారు. మెదడుకు చదువు ఎలానో, దేహానికి క్రీడలు అలా అని వారిలో క్రీడలపై ఆసక్తి పెంచారు. ఆదివారం, సెలవు రోజుల్లోనూ కూడా వారికి శిక్షణ ఇచ్చి ఆడిస్తున్నారు. తన విద్యార్థులను దేశం గర్వించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నది ఆయన సంకల్పం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు విద్యార్థులను రాష్ట్రీయ, జాతీయ పోటీలకు పంపారు. ఖోఖో, క్రికెట్, కబడ్డీ.. మరెన్నో ఆటల్లో పిల్లలకు చక్కని శిక్షణ ఇస్తున్నారు. వృత్తిపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన తపన మాటలకందనిది. అందుకు గుర్తింపు దక్కింది. ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా వరుసగా మూడేళ్లు అవార్డు అందుకున్నారు. కొమురయ్య ఆదర్శజీవితం ప్రతి ఉపాధ్యాయుడికి, విద్యార్థికి ప్రేరణ కావాలి. మైక్ టీవీ అందిస్తున్న ఆయన విజయగాథను మీరూ చూడండి.