“నేను శ్రీ మహా విష్ణువును, లక్ష్మీ దేవి భర్తను. పేదల కష్టాల తీర్చేందుకు పార్టీ పెట్టాను. నా పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రతీ ఒక్కరికి వైకుంఠం ట్రస్ట్ ద్వారా ఇళ్ల స్థలాలను ఇప్పిస్తాను..” ఇదీ జై మహ భారత్ అనే పార్టీ వ్యవస్థాపకుడి ప్రచార మంత్రం. భగవాన్ అనంత విష్ణు అనే వ్యక్తి.. జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల వేస్తున్నాడు. పేద ప్రజలకు 200 గజాల ఇండ్ల స్థలం వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఇస్తామని పలు బస్తిల్లో ప్రచారం చేస్తున్నాడు. కేవలం 18 ఏండ్లు నిండిన మహిళలకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని.. వారి నుంచి ఫోటోలు , ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని.. పార్టీ సభ్యత్వం ఇప్పిస్తున్నాడు. గత 5 నెలలుగా సభ్యత్వాలు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో గడువు ముగుస్తుందని ప్రచారం జరగడంతో.. లక్డీకాపూల్‌లోని పార్టీ ఆఫీస్ ముందు మహిళలు నిన్న భారీగా క్యూ కట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు.. స్పాట్‌కు చేరుకుని విచారించగా.. ఈ బాగోతం బయటపడింది. సభ్యత్వాలపై ఆరా తీసిన పోలీసులు.. బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గత నెలలో కూడా చాలామంది మహిళలు .. ఇదంతా నిజమే అనుకొని నమ్మి .. అతని పార్టీ ఆఫీస్ కు భారీగా చేరుకున్నారు. తీరా వచ్చాక ఇళ్ల స్థలం ఎలా ఉన్నా..పార్టీ సభ్యత్వం చేతిలో పెట్టారంటూ వాపోయారు. ఇళ్ల స్థలాలు ఇస్తారు కదాని ఆశపడి వచ్చిన మహిళలు పార్టీ సభ్యత్వం చేతిలో పెట్టేసరికి ఉసూరుమన్నారు. వచ్చిన మహిళల దగ్గర ఒక అథార్ కార్డు,రెండు ఫోటోలు..కరెంట్ బిల్ తీసుకొని ఆ పార్టీ సభ్యత్వం రసీదు ఇచ్చి పంపిస్తున్నారని జై మహాభారత్ పార్టీ శ్రేణులపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. తానెవర్నీ మోసం చేయట్లేదని అంటున్నారు పార్టీ ఫౌండర్ అనంతవిష్ణు. ఎవరి నుంచి డబ్బులు తీసుకోవడం లేదని, వారంతా తన దర్శనం కోసం వస్తుంటారని చెబుతున్నారు. వైకుంఠం ట్రస్ట్ ద్వారా డేటాను కలెక్ట్ చేసి.. అది ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. తమ పార్టీ తరపున వారి సంక్షేమం గురించి గవర్నమెంట్ ను అడుగుతామని అన్నారు. ఇక జై మహాభారత్ పార్టీని హైదరాబాద్ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఖండించింది. పార్టీ పేరుతో పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని.. ఇలాంటి వారిని ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపాలన్నారు. వీళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వీహెచ్‌పీ తెలిపింది.