పాక్‌కు బేజార్.. జైహింద్ అన్న బలూచిస్తాన్
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకపక్క భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతూ, యుద్ధ నినాదాలు చేస్తున్నారు. మరోపక్క.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రజలు మాత్రం భారత్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ రోజు భారత స్వాతంత్ర్యదినాన్ని పురస్కరించుకుని భారతీయులకు ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రాంతాన్ని పాక్ చెర నుంచి విడిపించాలని కోరారు.
‘భారత్ 70 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు గర్వంగా నిలుస్తున్నారు. భారత్ మా సమస్యను ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలపై లేవనెత్తాలి. మాకు భారత్ మద్దతు అవసరం.. జైహింద్.. ’ అని బాలూచిస్తాన్ ఉద్యమ కార్యకర్తలు అష్రఫ్ షెర్జాన్, అతా బలూచ్ మీడియాతో అన్నారు. 1948లో పాక్ చెరపట్టి బలూచ్ అప్పటి నుంచి స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తోంది. తమ ప్రాంతంలోని సహజ వనరులను పాక్ దోచుకుంటూ తమ పొట్టగొడుతోందని బలూచ్ వాసులు ఆరోపిస్తున్నారు. పాక్ సైనిక ఉక్కుపాదం కింద తాము నలిగిపోతున్నామని, బంగ్లాదేశ్‌కు ఇందిరాగాంధీ విముక్తి కల్పించినట్లు తమకూ భారత ప్రభుత్వం విముక్తి కల్పించాలని కోరుతున్నారు. పాక్ స్వతంత్ర్యదినాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ భారత్ కు మద్దతుగా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.