చైనాకు భయపడడానికి సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది రాహుల్ గాంధీ కాదు, ప్రధాని మోదీ అని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన చైనాతో యుద్దం, సరిహద్దు సమస్య, కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ‘ఎల్వోసీ వద్ద చైనా తన దళాలను మొహరించింది. దీన్ని తిప్పికొట్టేందుకు మన దళాలను పంపించినవారు ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ కాదు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బడ్జెట్లో ఐదు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించారు. 1962 యుద్ధంలో మన భూభాగాన్ని చైనా ఆక్రమించింది. రాజీవ్ గాంధీ 1988లో బీజింగ్ వెళ్లారు. 1993, 1996లలో ఒప్పందాలు చేసుకున్నారు.
వాటిని నేను తప్పుపట్టి రాజకీయం చేయాలనుకోవడం లేదు. స్థిరమైన సరిహద్దుల కోసం ఆ ఒప్పందాలు జరిగాయి. వారి ఆక్రమణలో ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద చైనా వంతెన నిర్మించింది. దీనికి కారణం ఏంటో నిజాయితీగా చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. సర్దుబాటు ధోరణితో ఉంటే సైన్యాన్ని ఎలా పంపుతాం? ఇప్పుడు చెప్పండి ఎవరు భయపడ్డారు? వాస్తవాలను చెప్తున్నదెవరు? చరిత్రతో ఆటలాడేదెవరు? అంటూ నిలదీశారు.