Jai Shankar spoke on oil imports from Russia
mictv telugu

దాన్ని తట్టుకునే శక్తి నా దేశానికి లేదు.. అందుకే ఆ పని చేశా : జై శంకర్

August 17, 2022

పెరిగిన ఇంధన ధరలు, అంతర్జాతీయ ప్రభావం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. థాయ్‌ల్యాండ్‌లో జరిగిన జాయింట్ కమిషన్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు కొనగలిగే ధరకు చమురును అందుబాటులో ఉంచడం తన కర్తవ్యమని పేర్కొన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, ఎవరి బెదిరింపులకు లొంగకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేశామని వెల్లడించారు. అప్పుడు మనం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆమోదిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కేవలం 2000 డాలర్ల తలసరి ఆదాయం కలిగిన భారత దేశ ప్రజలు అధిక ధరల వద్ద పెట్రోల్ ఉత్పత్తులను కొనగలిగే పరిస్థితి ఉండదన్నారు. అందుకే తక్కువ ధరకు ఇవ్వడానికి వచ్చిన రష్యాతో డీల్ కుదుర్చుకున్నట్టు వివరించారు. అలాగే నిజాయితీ, అరమరికల్లేకుండా వ్యవహరిస్తే ఇవ్వాళ తప్పుపట్టిన వారు రేపు సరైందేనని ఒప్పుకుంటారని, అందుకు యూరప్, అమెరికా దేశాల ప్రస్తుత వైఖరే కారణమన్నారు. ప్రతీ దేశం తన ప్రయోజనాలకు అనుగుణంగా మెసిలేందుకు పూర్తి హక్కులున్నాయని స్పష్టం చేశారు.