జై శ్రీరాం నినాదాలు.. పూలమాలలతో నిందితులకు స్వాగతం
హంతకులకు హారతులు పట్టి, గజమాలలు వేసి స్వాగతాలు పలుకుతున్న కాలానికి మనం వచ్చేశామా? రేపటి తరంలో రక్తం మరిగిన నేరస్థులే రాజ్యాలు ఏలుతారా? సమాజానికి మంచి చేస్తే మెచ్చుకునే రోజులు పోయి చేటు చేసినవారినే అక్కున చేర్చుకుంటున్న మార్పు వచ్చేసింది సమాజంలో? ఈ ఘటన అలాంటి భవిష్యత్తును కళ్లకు కడుతోందని సోషల్ మీడియాలో కొందరు మానవతా వాదులు అంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గతేడాది జరిగిన ఎస్సై హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితులకు స్థానిక నాయకులు పూలమాలలు వేసి, జైశ్రీరాం అంటూ వీరుడికి స్వాగతం పలికినంత హంగామా చేశారు. కేకలు, ఈలలు వేస్తూ హంతకులకు స్వాగతాలు పలికారు.
గత డిసెంబరులో జరిగిన బులంద్‌షహర్ సమీపంలో 25 ఆవులకు సంబంధించిన కళేబరాలు దగ్గర్లోని అటవీ ప్రాంతంలో కనిపించాయి. దీంతో గోవధ జరిగిందన్న ఆరోపణలపై అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. రెండు మతాలకు చెందిన దాదాపు 400 మంది అల్లరి మూక హింసాత్మక వాతావరణం సృష్టించింది. దీన్ని నియంత్రించేందుకు వెళ్లిన స్థానిక ఎస్సై సుబోధ్ కుమార్ సింగ్ ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈయనపై దాడి చేసిన వారికి సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
ఈ హత్యకు కారణమైన వారిగా భావిస్తున్న ఆరుగురని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తక్షణం విచారణ జరిపించాలని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసులో సిట్ 3,400 పేజీల నివేదికను సమర్పించగా, 38మందిపై 103 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసింది. తాజాగా సదరు నిందితులు శనివారం బెయిల్ పై విడుదల అయ్యారు. దీంతో ఓ జాతీయ రాజకీయ పార్టీ యువజన విభాగం స్థానిక నాయకులు నిందితులకు పూల దండలు వేసి, ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనందంతో వారికి స్వాగతాలు పలికారు. దీన్నంతా స్థానిక జర్నలిస్టులు తమ ఫోన్లలో వీడియోలు తీశారు.