రేపిస్టుకు 142 ఏళ్లు జైలు శిక్ష.. మన దేశంలోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్టుకు 142 ఏళ్లు జైలు శిక్ష.. మన దేశంలోనే..

October 1, 2022

అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణానికి తెగబడిన దుర్మార్గుడి పాపం పండింది. కూతురి వయసున్న బాలికపై రెండేళ్లపాటు పైశాచికంగా అత్యాచారం జరిపిన దోషికి ఏకంగా 142 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దేశంలో అత్యాచారం కేసులో ఓ దోషికి ఇంత సుదీర్ఘకాల జైలు శిక్ష పడడం ఇదే తొలిసారి. కేరళలోని పతనంతిట్ట జిల్లా కోర్టు శనివారం ఈ తీర్పు వెలువరించింది. దోషి ఆనందన్ పీఆర్కు ఈ శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది.

దోషికి ప్రస్తుతం 41 ఏళ్లు కావడంతో శిక్షాకాలం పూర్తవయ్యే వరకు బతకడు. బతికితే ఇంకో 60 ఏళ్లే జైల్లో ఉంటాడు. జరిమానా చెల్లింకపోతే మరో మూడేళ్లు జైల్లో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఆనందన్ తన బంధువుల కుమార్తె అయిన పదేళ్ల బాలికపై 2019 నుంచి 2021 మధ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారిని హింసించి, తీవ్రంగా కొట్టేవాడు. తిరువళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని పక్కా సాక్ష్యాలను పోక్సో కోర్టులో ప్రవేశపెట్టారు.