34 ఏండ్ల కిందటి దాడి కేసులో పీపీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల కిందట లొంగిపోయిన ఆయన.. ప్రస్తుతం పాటియాలా జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైలులో పెడుతున్న ఆహారం సిద్ధూ శరీరానికి పడట్లేదని శనివారం ఆయన లాయర్ హెచ్పీఎస్ వర్మ తెలిపారు. ఈ క్రమంలోనే అతన్ని ఇవాళ ఉదయం రాజింద్ర హాస్పిటల్కు మెడికల్ చెకప్ కోసం తీసుకువెళ్లారు. సిద్దూకు జైలు అధికారులు చపాతీలు, పప్పు పెడుతున్నారని, కానీ, ఆయనకు గోధుమ అలెర్జీ అని, ఆయన ఒంటికి గోధుమలు పడవని చెప్పారు వర్మ. అందుకే ఆయన ఆహారం ముట్టలేదని తెలిపారు.
సిద్ధూ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా స్పెషల్ డైట్ ఇవ్వాలని పాటియాలా కోర్టులో న్యాయవాది హెచ్పిఎస్ వర్మ విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం బాగోలేక సిద్ధూ ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. డాక్టర్ల బృందం నేడు సిద్దూకు రకరకాల పరీక్షలు చేపట్టనున్నది. పరీక్షల తర్వాత స్థానిక పాటియాలా కోర్టుకు ఆహారానికి సంబంధించిన నివేదికను సమర్పించనున్నది.