దేశంలోని కొత్త బస్ స్టాప్ రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం ఎదురుచూస్తుంది. దీనికోసం ఎంట్రీలను ఆహ్వానించింది. జైపూర్ కి చెందిన వీరేంద్ర సైనీకి కేంద్రప్రభుత్వం మొదటి బహుమతిగా 10లక్షల రూపాయలను అందచేసింది.
సమీప భవిష్యత్తులో జాతీయ రహదారులపై బస్ స్టాప్ లను రూపొందించేందుకు కేంద్రప్రభుత్వం యోచన చేస్తున్నది. దీని గురించి కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇన్ స్టా ద్వారా కూడా తెలియచేశారు.
కనీస సౌకర్యాలతో..
మొత్తం దేశంలోని జాతీయ రహదారులపై ఏకరీతి బస్ స్టాప్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేంద్రం NHLML, NHAI, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా బస్ షెల్టర్ డిజైన్ ను ప్రామాణీకరించడానికి డిజైనింగ్ పోటీని నిర్వహించింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్.. టాయిలెట్ల సౌకర్యం, టీ స్టాల్ ఏర్పాటుతో స్టయిలిష్ లుక్ తో, ఆకర్షణీయమైన బస్ స్టాప్ గా ఉన్న వీరేంద్ర రూపకల్పనను ఎంపిక చేసింది.
భారతప్రభుత్వంతో పాటు ఉన్నతస్థాయి ఇంజనీర్ల బృందం, ఎగ్జిక్యూషన్ కమిటీ ఎంపిక చేసిన బస్ స్టాప్ ల నిర్మాణాన్ని వివరించింది. కనీస నిర్వహణ, నిల్వ స్థలం, మొబైల్ ఛార్జింగ్, సోలార్ పవర్, బయో టాయిలెట్, సీసీటీవీ కెమెరా, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్, టీ స్టాల్, తాగునీరు వంటి ప్రయాణీకులకు కనీస అవసరాలు తీర్చేదిగా ఈ బస్ స్టాప్ రూపకల్పన చేశారు.
ఏమేం ఉన్నాయి?
వీరేంద్ర జైపూర్ లోని ఎమ్ఎన్ఐటీలో బీ ఆర్క్ 2004లో పూర్తి చేశాడు. అతను ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అదనంగా ఈ బస్ స్టాప్ రూపకల్పన చేశాడు. ఇందులో స్త్రీలకు, పురుషులకు, దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లను నిర్మించాడు. హైవేలో ఇవి కంపల్సరీ అంటున్నాడు. ఇక టీ స్టాల్ బస్ మెయింటెనెన్స్ చూసుకోవడానికి ఒకరు ఉండాలి కాబట్టి దీన్ని ఉంచాడు. ఇది ‘స్వచ్చ్ భారత్’ క్యాంపెయిన్ లో భాగమంటున్నాడు వీరేంద్ర. ఇందులోనే ప్రథమ చికిత్సకు కావాల్సిన మందులు, మెడికల్ ఫెసిలిటీలు కూడా ఏర్పాటు చేశాడు.