ఈ ట్రాఫికోళ్ల బుర్ర చాలా షార్ప్... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ట్రాఫికోళ్ల బుర్ర చాలా షార్ప్…

June 24, 2017

ట్రాఫిక్ పోలీసులు ఒక్కపని మాత్రం అద్భుతంగా చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ని జనంలోకి తీసుకెళ్లేందుకు క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. అన్ని రాష్ట్రాల పోలీసుల కన్నా జైపూర్ ట్రాఫిక్ పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. ఇంతకీ వీళ్లేం చేశారంటే..

ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుంటే ప్రమాదం తప్పదు. ఎన్నిసార్లు జైపుర్‌ ట్రాఫిక్‌ పోలీసు శాఖ హెచ్చిరించినా వాహనదారులకి ఎక్కలేదు. కానీ ఒకే ఒక పిక్చర్ వారి బుర్రకెక్కింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ లో టీమ్‌ఇండియా పేసర్‌ బుమ్రా నోబాల్‌ వేస్తున్న దృశ్యాన్ని ప్రచార చిత్రంలో ఉపయోగించింది. దానికి ‘గీత దాటొద్దు.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు’ అన్న సందేశాన్ని ఉంచింది. ఆ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్‌ వేయడంతో లైఫ్ దొరికిన పాక్ ప్లేయర్ ఫకర్‌ జమాన్‌ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ చిత్రంతో జైపూర్ పోలీసులు వాహనదారుల్ని ఆకట్టుకున్నారు వోకే గానీ బుమ్రా ఫీలయ్యేలా చేశారు. ‘‘చాలా బాగా చేశారు. దేశం కోసం అత్యుత్తమంగా పోరాడితే మీరిచ్చే గౌరవమేంటో తెలుస్తోంది. పనిలో మీరు చేసే పొరపాట్లను మీలా నేనేం అపహాస్యం చేయను.. ఆందోళన చెందకండి’’ అని జైపుర్‌ ట్రాఫిక్‌ పోలీసు శాఖకు బుమ్రా ట్వీట్‌ చేశాడు.

దీనిపై స్పందించిన జైపుర్‌ ట్రాఫిక్‌ పోలీసు శాఖ వివరణ ఇచ్చింది. ‘ప్రియమైన బుమ్రా.. నిన్ను బాధించాలని మా ఉద్దేశం కాదు. నీ సెంటిమెంట్లను, లక్షలాది క్రికెట్‌ అభిమానుల సెంటిమెంట్లను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో మేము అలా చేయలేదు. ప్రజల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచాలన్న ఉద్దేశంలో నీ ఫొటోను వాడుకున్నాం. బుమ్రా నువ్వు మా అందరికీ స్ఫూర్తి. ఆదర్శం.’ అని జైపుర్‌ ట్రాఫిక్‌ పోలీసు శాఖ రీ ట్విట్ చేసింది.