అథ్లెట్లు కరోనా వచ్చినా చావరు.. అబ్బబ్బ ఏం చెప్పావ్ అధ్యక్షా!
కొత్తగా పుట్టుకువచ్చిన కరోనా మహమ్మారిపై వైద్యులకే ఇంకా సరైన సమాచారం లేదు. దాని నివారణకు మందు కనిపెట్టడంలోనే వారు తలమునకలై ఉన్నారు. దాని గురించి ఏం అవగాహన లేని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో కరోనాపై అనుచిన, అజ్ఞానపు వ్యాఖ్యలు చేశారు. ‘ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినా.. వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు అథ్లెట్లు అవడంతో.. శారరీక దారుఢ్యం కలిగి ఉంటారు. ఏమాత్రం సందేహం లేకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం రేడియో గైబాతో మాట్లాడిన ఆయన.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా తమ ఆరోగ్యశాఖా మంత్రికి సూచించానని తెలిపారు.
‘నిరుద్యోగం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు కష్టాలు పడుతున్నారు. వారిలో చాలా మంది తిరిగి క్రీడల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారు’ అని చెప్పారు. మరోవైపు కరోనా నుంచి పరిస్థితులు చక్కబడ్డాకే మ్యాచ్ నిర్వహణ గురించి ఆలోచించాలంటూ బ్రెజిల్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్, ఆరోగ్య శాఖ సూచనలు కోరుతూ లేఖ రాసింది. ఇంతలోనే బోల్సోనారో వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై
సోషల్ మీడియాలోనూ నెటిజన్లు మండిపుడుతన్నారు. సావో పౌలో ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్, 1994 ప్రపంచ కప్ విజేత రాయ్ సైతం బోల్సోనారో మాటలను తీవ్రంగా ఖండించారు. కరోనా సంక్షోభాన్ని కట్టడి చేయలేని అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. తొలుత నుంచి కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. ‘లిటిల్ ఫ్లూ’ అంటూ బోల్సోనారో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా కరోనా కట్టడిలో భాగంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఈవెంట్లు వాయిదా పడ్డాయి. బ్రెజిల్‌లో నిర్వహించాల్సిన ఫుట్‌బాల్ టోర్నమెంట్లను కూడా తాత్కాలికంగా వాయిదా వేశారు. మే ప్రారంభంలో బ్రెజీలియన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బ్రెజిల్‌లో కరోనా మృతుల సంఖ్య 6వేలు దాటినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.