కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ మరణించారు. యాత్రలో ఆయనకు గుండెపోటు రాగా, హాస్పిటల్ కి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఈయన ప్రస్తుతం జలంధర్ ఎంపీగా ఉన్నారు. జోడో యాత్ర పంజాబ్ లోని ఫిలౌర్ ప్రాంతంలో కొనసాగుతుండగా, శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్ యాత్ర ఆపేసి ఆస్పత్రికి బయల్దేరారు. ఎంపీ మరణంపై పంజాబ్ సీఎం భగవంత మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కాగా, 1946 జూన్ 18న జన్మించిన సంతోఖ్ సింగ్.. పంజాబ్ కేబినెట్ మినిస్టర్ గా పని చేశారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో వరుసగా జలంధర్ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు.