నిన్నలేని అందాన్ని నిద్రలేపిన కరోనా లాక్‌డౌన్..  - MicTv.in - Telugu News
mictv telugu

నిన్నలేని అందాన్ని నిద్రలేపిన కరోనా లాక్‌డౌన్.. 

April 4, 2020

‘నిన్నలేని అందమేదో.. నిదుర లేచెనెందుకో..’ అని చక్కని తెలుగు సినిమా పాట ఉంది. ‘ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగనో..’ అని పరశంతో పాడతాడు కథనాయకుడు. కరోనా మానవాళిని భయపెడుతున్నా కొన్నిచోట్ల కొత్త అందాలను తట్టితట్టి లేపుతోంది. లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వారి వాహనాలు కూడా పార్కింగ్ ప్లేస్‌లోనే ఉండిపోయాయి. పొగ, దుమ్ము లేక గాలి కాలుష్యం కాకుండా స్వచ్ఛంగా ఉండింది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం తగ్గిపోయింది. దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. ఇప్పటివరకు కంటికి కనిపించని పక్షలు ఇప్పుడు మన ఇళ్ల ముందుకు వస్తున్నాయి. ఆహా కాలుష్యం లేని గాలి అన్నట్టు పలుచోట్ల అడవుల్లో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. భారత్‌లో కూడా వాయు కాలుష్యం తగ్గి ఇప్పుడు కొంతమేరకు స్వచ్ఛమైన గాలి లభిస్తోంది అందరికీ. అయితే వాయుకాలుష్యం భారత్‌లో ఎంతలా తగ్గిందనే విషయాన్ని చెప్పడానికి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

పంజాబ్‌లోని జలందర్ సిటీ వాసులకు కేవలం 213కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని దౌలాబార్ హిమాలయాల రేంజ్ కనిపించేది కాదు. కారణం, కొన్ని దశాబ్దాలుగా పేరుకున్న కాలుష్యమే. ఇప్పుడు ఆ సిటీ వాసులు దశాబ్దాల తర్వాత మళ్లీ.. పూర్తిగా మంచుతో కప్పబడిన ఆ హిమాలయ పర్వత శ్రేణులను సృష్టంగా చూస్తున్నారు. దీంతో జలంధర్ సిటీవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి ప్రకటించిన 21రోజుల లాక్‌డౌన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ ఆనందాన్ని పదిమందితో పంచుకోవాలని కొంతమంది తమ మిద్దెపై నుంచి తీసిన ఆ హిమాలయాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ఈ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ‘జలంధర్ వాసులు కొన్ని దశాబ్దాలుగా చూడని దౌలాబార్ ‌రేంజ్‌ని మళ్లీ చూస్తున్నారు. కాలుష్యం ఈవిధంగా మనలను అంధులను చేసింది’ అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు క్రికెటర్ హార్భజన్ సింగ్ కూడా తన ఇంటిపై నుంచి తీసిన ఫోటోను షేర్ చేశారు.