ఉక్రెయిన్లో జీవాయుధాలు తయారు చేస్తున్నారన్న రష్యా ఆరోపణలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ‘నా ఇద్దరు పిల్లల తండ్రిగా చెప్తున్నా. జీవాయుధాలకు ఉక్రెయిన్లో ఎలాంటి స్థానం లేదు. అలాంటి పని మేం చేయమని ప్రపంచంతో పాటు రష్యాకు కూడా తెలుసు. ఒకవేళ ఈ సాకుతో రష్యా మామీద జీవాయుధాలతో దాడి చేస్తే మరిన్ని కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటార’ని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాగా, గురువారం రష్యా విదేశాంగ మంత్రి, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చల అనంతరం మీడియాతో మాట్లడుతూ.. అమెరికా సహాయంతో ఉక్రెయిన్ జీవాయుధాలను తయారు చేస్తోందనీ, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు. తమ సైన్యం హస్తగతం చేసుకున్న
బయోలేబరేటరీలో పక్షులు, గబ్బిలం, సరీసృపాల వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేసేందుకు ప్లాన్ చేసి ఉంచారని ఆరోపించారు. అంత్రాక్స్, కరోనా వైరస్ నమూనాలతో ప్రయోగాలు కూడా చేశాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వీడియోను రిలీజ్ చేశారు.