హిజ్బుల్ వెన్ను విరిచిన భారత ఆర్మీ.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం  - MicTv.in - Telugu News
mictv telugu

హిజ్బుల్ వెన్ను విరిచిన భారత ఆర్మీ.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం 

May 19, 2020

bvgf

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నారు. రెండు రోజుల క్రితం హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తాహిర్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దోడా జిల్లా ఖోత్రా గ్రామంలో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా  ఆపరేషన్‌ నిర్వహించి‌ ‌‌తాహిర్‌‌ను అంతమొందించాయి. తాజాగా హిజ్బుల్ ముజాహిదీన్‌‌కు చెందిన కమాండర్ జునైద్ అష్రఫ్ షహ్రాయ్‌ను భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మట్టుబెట్టారు. శ్రీనగర్‌ నవకదల్ ప్రాంతంలో 10 గంటలకు పైగా సాగిన ఎన్‌కౌంటర్‌లో జునైద్ అష్రఫ్ షహ్రాయ్‌ను అతడి సహచరుడిని అంతమొందించారు. జునైద్ అష్రఫ్ షహ్రాయ్‌ తెహ్రీక్ ఎ హురియత్ చీఫ్ మహ్మద్ అష్రఫ్ షహ్రాయ్ చిన్న కుమారుడు. తన కుమారుడిని వెనక్కు రావాలని, లొంగిపోవాలని తాను చెప్పబోనని మహ్మద్ అష్రఫ్ షహ్రాయ్ ఇటీవలే ప్రకటించారు.

జమ్మూకశ్మీర్ డీజీపీ సూచించినా ఆయన తన కుమారుడిని వెనక్కు పిలవలేదు. ఇంతలోనే జునైద్ హతమయ్యాడు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జునైద్(27)  ఎంబీఏ చదివాడు. దీంతో హిజ్బుల్ అతడికి తక్కువ సమయంలోనే కీలక బాధ్యతలు అప్పగించింది. తాహిర్ అహ్మద్ కన్నా ముందు ఈ నెల 6న హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్ ఆల్ ఔట్ పేరుతో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఇప్పటివరకూ 80 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల నేతలకు చమటలు కక్కిస్తున్నారు.