ఇటీవల కాలంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బుద్గావ్ జిల్లాలో గురువారం ఓ కశ్మీర్ పండిట్ను దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. ఈ హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున్న కశ్మీర్ పండిట్లు నిన్న రాత్రి పలుచోట్ల నిరసనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్ పథకంలో రాహుల్ భట్ అనే కశ్మీరి పండిట్ చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆయన్ను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భట్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు. ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతున్నాయి. ఇదిలావుండగా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబరు నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయి.