Jammu and Kashmir: Villagers capture terrorists
mictv telugu

జమ్మూకశ్మీర్: ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు

July 4, 2022

జమ్మూకశ్మీర్‌లో లష్కర్ ఏ తయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను రియాసీ గ్రామస్థులు తాళ్లతో కట్టి బంధించారు. ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు గ్రామస్థులు చేసిన ధైర్య, సాహసాలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ దిల్ బాగ్ సింగ్ అభినందించారు. అనంతరం గ్రామానికి లెఫ్టినెంట్ గవర్నర్ రూ. 5 లక్షలు, డీజీపీ రూ.2 లక్షల నగదును బహుమతిగా ప్రకటించారు.

వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా టర్సన్ ధోల్ గ్రామస్థులు ఇద్దరు ఉగ్రవాదులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మట్టి ఇంట్లో దాక్కున్న లష్కరే ఉగ్రవాదులైన తాలిబ్ హుస్సన్ షా, అతడి సహచరుడైన ఫైసల్ అహ్మద్ దార్‌‌లను గ్రామస్థులు తాళ్లతో బంధించారు. ఆ తర్వాత జమ్మూ-కశ్మీర్ పోలీసులకు అప్పగించారు. అయితే, పట్టుబడిన ఆ ఇద్దరు ఉగ్రవాదులు తాజాగా జరిగిన రాజారీ మందుపాతరల పేలుళ్ల సూత్రధారి తాలిబ్ హుసేన్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న రెండు ఏకే రైఫిళ్లు, ఏడు గ్రనేడ్లు, పిస్టల్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరాలను వెల్లడించారు.