కశ్మీర్‌లో ఊహించినట్టే.. ప్రపంచ పెట్టుబడుల సదస్సు - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో ఊహించినట్టే.. ప్రపంచ పెట్టుబడుల సదస్సు

August 13, 2019

Jammu & Kashmir..

ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేసిన కేంద్రం జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  కశ్మీరీల తలరాత మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూ-కశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఎన్‌కే చౌదరి మంగళవారం మాట్లాడుతూ.. జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో జరిగే మొట్టమొదటి ప్రపంచస్థాయి సదస్సు ఇదే అవుతుందని అన్నారు. అక్టోబరు 12 నుంచి 14 వరకు పెట్టుబడిదారుల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు.ఈ సదస్సు ప్రారంభ సమావేశం అక్టోబరు 12న శ్రీనగర్‌లో జరుగుతుందని స్పష్టంచేశారు.

‘పెట్టుబడిదారుల సదస్సులో పర్యటక రంగానికి పెద్దపీట వేస్తాం. పారిశ్రామికవేత్తలు పర్యాటక రంగంవైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. జమ్మూ-కశ్మీర్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో పర్యటక రంగం వాటా 15 శాతం. ఈ రంగంలో 50 శాతం ఉద్యోగావకశాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో పారిశ్రామికవేత్తలు జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటకం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఇళ్ళను నిర్మించుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌లో రియల్ ఎస్టేట్ ధరలు మిగతా దేశంతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇక్కడి సెంటిమెంట్ ఇప్పుడే చల్లారే అవకాశం లేదనేవారు కూడా ఉన్నారు. జమ్మూ-కశ్మీర్ అభివృద్ధి బాట పట్టేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు మరికొంత సమయం పడుతుందని వీరు చెబుతున్న మాట’ అని అన్నారు.