సాధారణంగా ఒక ఎదిగిన మేక బరువు ఎంతుంటుంది మా అంటే 40 నుంచి 50 కేజీల వరకు ఉంటుంది. కానీ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ 3 ఏళ్ల మేకపోతు బరువు సరాసరి 110 కేజీలు. మేకపోతు బరువు చూసి అవాక్కవుతున్నారా.. అయితే ఇది అలాంటి ఇలాంటి మేకకాదు మేకల్లోనే ప్రత్యేకమైన బ్రీడ్ ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జమునాపారి బ్రీడ్ మేక ఇది. తెలంగాణకు చెందిన శంకర్ కిచర్ అనే రైతు ఈ మేకపోతును ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. దీని బరువే కాదు ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే. మార్కెట్లో ఈ మేక ధర రూ.6 లక్షల వరకు పలుకుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేషనల్ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్లో ఈ భారీ మేకపోతు సందడి చేసింది. బరువు విభాగంలో మేకపోతులకు జరిగిన పోటీల్లో మొదటి బహుమతిని అందుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన మేకపోతులు, గొర్రెలు ఈ ప్రదర్శనకు తరలివచ్చాయి. అయినా తెలంగాణ రైతు పెంచిన ఈ మేకపోతుకు విజయం వరించింది.
జమునపారి మేక భారతదేశంలో అత్యుత్తమ పాడి మేకగా ప్రసిద్ధి చెందింది. ఇది అత్యంత ఎత్తైన జాతి మేకపోతు. దాని గంభీరమైన ఎత్తు కారణంగా సాధారణంగా స్థానికులు ఈ మేకను “పరి” అని పిలుస్తారు. జమునాపారి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేశీయ మేక. ఈ మేక లక్షణాల కారణంగా ఇండోనేషియాకు ఎగుమతి చేయబడింది. ఈ మేకపోతులను పాలు , మాంసం రెండింటి కోసం పెంచుతారు. సాధారణంగా జమునాపారి మేకల మెడ తలపై తెల్లగా ఉంటుంది. వాటి ముక్కు చాలా పెద్దగా ఉంటుంది. వీటకి 25 సెం.మీ. పొడవులో చెవులుంటాయి. పొదుగు గుండ్రంగా ఉంటుంది. అసాధారణంగా ఈ మేకలకు పొడవాటి కాళ్ళు ఉంటాయి. సాధారణంగా జమునాపారి మేకలు 40 కిలోల వరకు బరువు పెరుగుతాయి. కానీ రైతు శంకర్ కిచర్ తీసుకున్న జాగ్రత్తుల అందించిన మేతల వల్ల ఈ మేకపోతు ఏకంగా 110 కేజీలు పెరిగి అందరిని ఆకర్షిస్తోంది.