మాది గాలివాటం పార్టీ, నేను వైసీపీ వెంటే.. జనసేన ఎమ్మెల్యే  - MicTv.in - Telugu News
mictv telugu

మాది గాలివాటం పార్టీ, నేను వైసీపీ వెంటే.. జనసేన ఎమ్మెల్యే 

August 11, 2020

Janaesna party mla rapaka varaprasada rao sensational comments.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాదరావు ఒక్కరే గెలుపొందిన సంగతి తెల్సిందే. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన అధికార వైసీపీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలిచారు. తాజాగా ఇటీవల రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పార్టీ అధ్యక్షుడిపై పరోక్ష కామెంట్లు చేశారు. జనసేన గాలివాటం పార్టీ అన్నారు. ఆయనే గెలవలేదని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

‘రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశాం. ఇప్పుడు మళ్లీ చేస్తున్నాం. 2019లో వైఎస్సార్‌సీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించాను. టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా ఒప్పుకున్నారు. ఓ గెస్ట్ హౌస్‌లో చర్చ జరిగింది. నన్ను పిలిచి మాట్లాడారు. టికెట్ వచ్చిందని సంబరాలు చేశారు. కానీ, చివరి నిమిషంలో రాజేశ్వరరావుకు ఇచ్చారు. నేను ఖాళీగా ఉన్న సమయంలో కొందరు జనసేన నేతలు నా ఇంటికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానించారు. నేను జనసేన పార్టీలో చేరాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం జగన్‌ను కలిశాను. టికెట్ ఇవ్వలేకపోయానని ఆయన నాతో అన్నారు. అయినా సరే కలిసి పని చేద్దామని చెప్పారు. అప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నాం. రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ నిధులు కేటాయించారు. నేను ప్రస్తుతానికి వైఎస్సార్‌సీసీ కిందే నడుస్తాను. నేను నెగ్గిన పార్టీ నిలబడేది కాదు. ఆయనే విజయం సాధించలేదు. వ్యక్తిని బట్టి పార్టీపై ఇష్టం లేకపోయినా నాకు అందరూ మద్దతు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీలో వర్గాలు ఉండొచ్చు. కానీ అధినేత ఒక్క మాట చెబితే గొడవలు సద్దుమణుగుతాయి.’ అని రాపాక వరప్రసాదరావు అన్నారు.