కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని సీఎల్పీ నేత జానా రెడ్డి విమర్శించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. అభిప్రాయం చెప్పకూడదని అధికార పార్టీ భావించడం అప్రజాస్వామికమన్నారు. ప్రాజెక్టు కట్టాలా.. వద్దా అని అధికారులు ప్రశ్న అడగటం సరి కాదన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దు అనేది కాంగ్రెస్ అభిమతం కాదని, కాంగ్రెస్ పార్టీయే ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యం కాదని చెప్పారు.
అలాగే ప్రభుత్వం చేపట్టనున్న భూసర్వే భూసేకరణ వచ్చే నెల 15 నుండి డిసెంబర్ వరకు జరగనున్న ఈ ప్రక్రియ మీద కూడా జానా తనదైన శైలిలో స్పందించారు. ‘భూ సర్వే భూసేకరణ విధివిధానాలు బయటపెడితే సమాచారం తెలుస్తుంది. మేము కూడా చేయాల్సిన సూచనలు చేస్తాం. శాస్త్రీయంగా చేస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది’ అని అన్నారు. రైతులకు న్యాయం, భూములను కాపాడే దిశలో అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం కూడా మద్దతివ్వడం హర్షించదగ్గ విషయమే.