పార్టీ స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికారం కైవసం : పవన్
తెలుగువారి సత్తాను ఢిల్లీకి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పవన్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.
‘‘చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది.
తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక శ్రీ ఎన్.టి.ఆర్. - JanaSena Chief Shri @PawanKalyan #100YearsOfNTR #NTRJayanti pic.twitter.com/43DXD4qKeX
— JanaSena Party (@JanaSenaParty) May 28, 2023
ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి.. అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాక చాటారు. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా తరఫున, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’’ అని పవన్ ట్వీట్ చేశారు.