నటుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుతోపాటు బీజేపీకి కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా అంశాల్లో ఆయన బాబుకు, బీజేపీకి అండగా నిలిచారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బాబు అనే పేరు వినిపిస్తే చాలు కోపంతో ఊగిపోతున్నారు. పవన్ ఈ రోజు అమరావతిలో జనసేన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.బాబును, మోదీనీ తీవ్రంగా విమర్శించారు. ‘2014లో తిరుపతిలో జరిగిన సభలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఎన్నికల తర్వాత ప్రత్యేక ప్యాకేజీగా మారిపోయింది. బాబు నన్ను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు. జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించనేలేదు. ఏపీకి ప్రత్యేక హోదాపై పూటపూటకు మాట మారిస్తే రాజకీయ చిత్తశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని మండిపడ్డారు. ఇక బీజేపీతో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆ పార్టీని ఎప్పుడూ వెనకేసుకురాలేదన్నారు. ‘మోదీ నాకేం అన్న కాదు, అమిత్ షా బాబాయి కాదు. బీజేపీ నేతలతో నాకు బంధుత్వం కూడా లేదు.. ’ అని అన్నారు. టీడీపీ నేతలపై సాగుతున్న ఐటీ దాడులపై స్పందిస్తూ.. ‘కడప, నెల్లూరులోని మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలపై, వ్యాపారులపై జరిగే ఐటీ దాడులకు నేను స్పందించను. దురుద్దేశ దాడులపైనే స్పందిస్తాను.. ’ అని అన్నారు.