నేడు జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ తన వారాహి బస్సులో వేదిక వద్దకు రానున్నారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్దెత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 34 ఎకరాల విస్తీర్ణంలోఏర్పాటు చేసిన ప్రాంగణంలో పవన్ ప్రసంగించనున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లతో ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.
కాగా సభవేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్యవేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్యం, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం సభాస్థలిని పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు.
అటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది. దీంతో పోలీసు శాఖ విజ్ణప్తి మేరకు వారాహి యాత్రను ముందు అనుకున్నట్లు కాకుండా స్వల్పంగా మార్పులు చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా అసెంబ్లీకి వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ తన వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్తారు. పోలీసుల విజ్ణప్తి మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వ్యవహారాల ఇంచార్జీ నాదెండ్ల మనోహర్ తెలిపారు.