సాగునీటి మంత్రి అంబటి రాంబాబును నిలదీసిన మహిళ గంగమ్మకు జనసేన పార్టీ రూ. 4 లక్షల సాయాన్ని అందించింది. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో శుక్రవారం చెక్కును గంగమ్మకు అందజేశారు. అంతేకాక, గంగమ్మకు పరిహారంగా ప్రకటించిన డబ్బు వెనక్కి వచ్చేంతవరకు జనసేన పోరాడుతుందని ప్రకటించారు. వివరాల్లోకెళితే.. గుంటూరు సమీపంలోని దాసరిపాలెం నుంచి తురక పర్లయ్య కుటుంబం ఏడాదిన్నర కిందట సత్తెనపల్లికి బతుకుతెరువు కోసం వచ్చి రోడ్డు పక్కన గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. పర్లయ్య కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉంటుండగా, గంగమ్మ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఈ దంపతులకు అనిల్ (17), సమ్మక్క (14) సంతానం. అయితే అనిల్ గతేడాడి ఆగస్టు 20న పట్టణంలోని మురుగు శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారంగా రూ. 5 లక్షల చెక్కు వచ్చింది. కానీ ఇందులోంచి రెండున్నర లక్షలు ఇస్తేనే చెక్ ఇస్తామని మున్సిపల్ చైర్మన్ భర్త, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన అంబటి రాంబాబు చెప్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ విషయం సంచలనం కావడంతో ఏ కారణం చేతనో ప్రభుత్వం చెక్కును వెనక్కి తీసుకుంది. అటు ఆరోపణలు తీవ్రం కావడంతో మంత్రి అంబటి స్పందించారు. పరిహారం సొమ్ములో లంచం తీసుకునే దీన స్థితిలో తాను లేనని, బాధితులకు పరిహారం ఇప్పించిందే తానని స్పష్టం చేశారు. తనను అవినీతిపరుడిగా చిత్రీకరించే దుర్మార్గ యత్నమంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే గంగమ్మ మరో ఆరోపణ చేసింది. ఈ పరిణామాలతో న్యాయంగా తమకు రావాల్సిన ఇంటిని కూడా ఆపేశారని వాపోయింది. ఈ నేపథ్యంలో జనసేన స్పందించి ఆర్ధిక సాయం చేయడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.