జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సదస్సు జరిగిన రెండు రోజుల పాటు విమర్శలకు దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు మళ్లీ వైసీపీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిదంటూ ఏపీ సర్కార్ చెప్పుకోవడంపై నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రారంభమైన కంపెనీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపించారని, రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. పాత కంపెనీలతోనే కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. ఉపయోగం లేని ఈ సదస్సు కోసం రెండ్రోజుల్లో రూ.175 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని తెలిపారు.
సదస్సులో జరిగిన ఒప్పందాల్లో 8 శ్రీసిటీలోని పాత కంపెనీలు అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.అదే విధంగా తిరుపతి, విశాఖల్లో ఓబెయార్ సంస్థకు గతంలోనే భూములు కేటాయించగా, నిర్మాణాలు కూడా జరిగాయన్నారు. వాటికి ఇప్పుడు మరోసారి ఎంఓయూలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. జగన్ వస్తే పెట్టుబడులు వస్తాయని అందరూ భావించినా..ఉన్న కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. సమ్మిట్ లో ఒక్కరోజు హేమాహేమీలను తీసుకువచ్చి రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చూపించే ప్రయత్నాన్ని అర్థంచేసుకోవాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.