తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్నీ పాదయాత్రల మీద పడ్డాయి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడానికి పాదయాత్రలను ఆశ్రయిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బండి సంజయ్, వైఎస్సార్టీపీ షర్మిల పాదయాత్రలు కొనసాగుతున్నాయి.
ఏపీలో 2014కు ముందు పాదయాత్ర చేసిన చంద్రబాబు అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు మహా పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్నారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేయబోతున్నారని సమాచారం. ఈ లోపు ఆ పార్టీ ఆధ్వర్యంలో మినీ పాదయాత్ర జరుగనుంది. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం నుంచి డిసెంబర్ 9న పాదయాత్ర ప్రారంభమై అనకాపల్లిలో ముగుస్తుంది. ఎలమంచిలి నియోజకవర్గం ఇన్ చార్జ్ సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంలో ఈ పాదయాత్ర జరగబోతోంది. యాత్ర పొడవునా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.