మర్కజ్ వెళ్లొచ్చిన జనగామ ప్రభుత్వాధికారి..  గుట్టుచప్పుడు ఆఫీసుకు..   - MicTv.in - Telugu News
mictv telugu

మర్కజ్ వెళ్లొచ్చిన జనగామ ప్రభుత్వాధికారి..  గుట్టుచప్పుడు ఆఫీసుకు..  

April 4, 2020

Jangaon Govt Employee Corona Positive

నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్‌లో పని చేసే ఓ అధికారి కూడా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయం దాచి ఐఏఎస్‌లతో పాటు సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో అతన్నిక్వారంటైన్‌కు తరలించి సెక్రటేరియట్ శానిటైజ్ చేశారు.  

తాజాగా జనగామలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అధికారి మహ్మద్ ఖాజా మొహీనుద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి ఎప్పటిలాగే విధులకు హాజరు అవుతున్నాడు. ఈ నెల 21, 23, 27 తేదీల్లో ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఆయనపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వెంటనే 269, 270 సెక్షన్లలో కేసు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలించారు. బాధ్యత గల పదవుల్లో ఉండి కూడా వారు ప్రార్థనలకు వెళ్లిన విషయాన్ని దాచిపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటికే చాలా మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి పెట్టి సాధారణంగా తిరుగుతుండటంతో ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది.