అందాల తార శ్రీదేవి చనిపోయి మరో మూడు రోజుల్లో ఐదు సంవత్సరాలు కావస్తున్నది. ఈ సందర్భంగా శ్రీదేవి కుమార్తె, నటి జాన్వీకపూర్ తల్లి గురించి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ఇప్పుడది వైరల్ గా మారింది.
అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో మరణించింది. అక్కడ ఆమె కుటుంబ వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ తో కలిసి వెళ్లింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందింది. అప్పటికి ఆమె వయసు 54యేండ్లు మాత్రమే. శ్రీదేవి చనిపోయాక సంవత్సరానికి జాన్వీ కపూర్ దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసింది.
పోస్ట్ వైరల్..
శ్రీదేవి కి కూతర్లంటే ప్రాణం. ఎక్కడికి వెళ్లినా వారిని వెంట పెట్టుకొని వచ్చేది. అలా ఒక అవార్డ్ ఫంక్షన్లో శ్రీదేవితో జాన్వీ ఉన్న ఫోటోను షేర్ చేసింది జాన్వీ. ఈ చిత్రంలో తెల్లని చీరలో శ్రీదేవి, పక్కన తల్లిని చూస్తూ జాన్వీ కనిపిస్తారు. ఈ ఫోటోకు ‘నేను ఇప్పటికీ నీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను అమ్మా. ఇప్పటికీ నేనే చేసే ప్రతి పని చూసి నువ్వు గర్వపడుతున్నావని ఆశిస్తున్నా. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పని అయితే నీతోనే మొదలవుతుంది, నీతోనే ముగుస్తుంది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కి తన సహనటులే కాదు.. చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మాత్రం ‘మీ పనిలో 200శాతం ఇవ్వండి. కచ్చితంగా ఆమె మిమ్మల్ని చూసి గర్వపడుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీదేవి గురించి..
శ్రీదేవి 60వ దశకంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. 80ల్లో ప్రధాన పాత్రలు పోషించింది. తమిళ, తెలుగు సినిమాలతో పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్ కలల రాణిగా అవతరించింది. దశాబ్దన్నర కాలంలో ఆమె నంబర్ వన్ నటిగా కొనసాగింది. 1997లో జాన్వీ పుట్టిన తర్వాత నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ సినిమాలు చేసి అందరి మనసులను దోచేసుకొని అర్ధాంతరంగా కన్నుమూసింది.