Japan Green Newspaper:That Blooms When You Plant It Is A Perfect Lesson In Recycling
mictv telugu

Viral News : చదివి పడేస్తే మొలకెత్తే వార్తా పత్రిక.. 100% బయోడిగ్రేడబుల్‌ పేపర్‌తో

February 23, 2023

 

చదివి పడేసిన న్యూస్ పేపర్లను.. మనలో ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతుంటారు. ఏదైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతున్న వాళ్లయితే భద్రంగా దాచుకుంటారు. ఇంకొందరైతే ఇంట్లో షెల్ఫ్‌లలో, లేదంటే కేజీల్లెక్కన అమ్మేస్తుంటారు. కానీ రీసైక్లింగ్‌కు అసలైన అర్థంగా.. పడేసిన వార్తపత్రిక తిరిగి పరిమళాలు వెదజెల్లే పూల మొక్కగా మారితే… కచ్చితంగా అద్భుతమే. జపాన్‌లోని ‘మైనిచి షింబున్షా’ అనే ప్రచురుణ సంస్థ.. అలాంటి పనే చేస్తోంది. వార్తా పత్రికలకు అవసరమైన కాగితం కోసం ప్రపంచంలో ఏటా 95 మిలియన్‌ చెట్లను నరికివేస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకూ పర్యావరణ పరిరక్షణ కోసం ‘ది మైనిచి షింబున్షా’ మే 4, 2016న తొలిసారి ఈ పత్రికను ప్రచురించింది. పర్యావరణ వార్తలకు అంకితం చేస్తూ 100 శాతం బయోడిగ్రేడబుల్‌ పేపర్‌తో ప్రత్యేక ఎడిషన్‌గా వచ్చిన తొలి పత్రికగా ఇది గుర్తింపు పొందింది. ఈ ‘గ్రీన్‌ న్యూస్‌పేపర్‌’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

పాత కాగితాలను రీసైకిల్‌ చేసి, దానికి వివిధ రకాల మొక్కల విత్తనాలను జతచేసి తయారు చేసిన కాగితాన్ని ముద్రణ కోసం వినియోగిస్తారు. వార్తలను ముద్రించేందుకు కూడా మొక్కల నుంచి తీసిన సహజసిద్ధ సిరాను వినియోగించడం మరో ప్రత్యేకత. జపాన్‌ మార్కెట్‌లో ప్రతిరోజు సుమారు 40.60 లక్షల మందికి చేరుతున్న ఈ పత్రికను చదివిన అనంతరం మట్టిలో పడేస్తే దాన్నుంచి మొక్కలు మొలిచి సీతాకోక చిలుకలను ఆకర్షించే పూలు పూయడం అంతకంటే ప్రత్యేకం. ప్రస్తుత పర్యావరణ సమస్యలపై పిల్లలకు అవగాహన పెంచడానికి, భవిష్యత్‌ తరానికి పేపర్‌ రీసైక్లింగ్‌ ప్రాముఖ్యతను బోధించేందుకు ఉత్తమ మార్గంగా ఈ పత్రిక ప్రత్యేకతను అక్కడి పాఠ్యాంశాల్లో చేర్చడం గమనార్హం.

అమెరికాకు చెందిన ‘వన్‌ ఎర్త్‌’ అనే ఎన్‌జీవో సంస్థ.. ఈ పేపర్ గురించి చెబుతూ.. ఇంటర్నెట్ వాడుతున్న ఈ రోజుల్లో కూడా గ్రీన్‌ న్యూస్‌పేపర్‌ ముద్రణ ద్వారా ప్రచురణకర్త 7 లక్షల డాలర్లకు పైగా ఆర్జించడం పెద్ద సంచలనమని చెప్పింది. వార్తాపత్రిక పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణగా, పర్యావరణంపై ప్రజల్లోని చైతన్యానికి గుర్తుగా వివరించింది. భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోను మొలకెత్తే పత్రికల ముద్రణ ప్రారంభమైందని, అమెరికాలోని అనేక కంపెనీలు వివిధ ప్రయోజనాల కోసం ప్లాంటేషన్‌ పేపర్‌ను తయారు చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. ఇటీవల వన్‌ ఎర్త్‌ చేసిన సర్వేలో భారత్‌లో శుభలేఖలు, యూరప్‌లో 74 శాతం గ్రీటింగ్‌ కార్డులను మొలకెత్తే రీతిలో తీసుకొచ్చినట్టు తెలిపింది.