ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 30 ఏళ్లు.. మనుషులకు బహుదూరంగా.. కిలోమీటరంతే ఉన్న ద్వీపంలో, కాకులు దూరని కారడవిలో బతికాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా జంతువుల్లో జంతువుగా బతికాడు. దొరికింది తిన్నాడు, లేకుంటే పస్తులు పడుకున్నాడు. అచ్చం ఆదిమానవుడిలా గోడపై పిచ్చిపిచ్చి రాతలు గీతలు గీశాడు.. వయసు పైబడింది. 80 ఏళ్లు దాటిపోయాయ్. ‘ఇక్కడే ఉంటే చచ్చిపోతావ్.. మనుషుల్లో కలిసిపో’ అని అధికారులు అతణ్ని మళ్లీ నాగరిక లోకంలోకి పట్టుకొచ్చాడు. కార్లు, బస్సుల రణగొణ ధ్వనులను, కలుషిత సమాజాన్ని భరించలేకపోయాడు. మళ్లీ తన ద్వీపానికి పోతానన్నాడు.
ఇంతలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఎక్కడికీ కదల్లేకపోయాడు. నాలుగేళ్లు మనుషుల మధ్య బిక్కుబిక్కుమని గడిపాడు. మళ్లీ ద్వీపం పిలుస్తోందంటూ కొత్త పాట అందుకున్నాడు. అధికారులు తలలు పట్టుకని సరేనని ఒప్పుకున్నాడు. అతణ్ని మళ్లీ ఒంటరి అడవిలో వదిలేశారు.
ఇది కట్టుకథ కాదు. జపాన్‌కు చెందిన 87 ఏళ్ల ముసఫూమీ నాగసాకి రియల్ స్టోరీ. లోకంపై విరక్తితో అతడు మూడు దశాబ్దాల కిందట తైవాన్ దగ్గర్లోని ఒకినవా ద్వీపానికి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లు మొదట అందుకు ఒప్పుకోకపోయినా అతని పట్టదల చూసి కాదనలేకపోయాడు. ‘చావైనా బతుకైనా అక్కడే’ అని నాగసాకి బైబై చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ద్వీపంలో ఆదిమానవుడిలా బతికేశాడు.
మరీ తప్పనిసరైన అగ్గిపెల్టె, కొవ్వొత్తులు, ఉప్పు వంటి వాటిని దగ్గర్లోని మరో ద్వీపానికి వెళ్లి కొనుక్కుని మళ్లీ తన ద్వీపానికి వచ్చేవాడు. అవి కొనుక్కోడానికి కుటుంబసభ్యులు డబ్బుల పంపేవాళ్లు. 29 ఏళ్లకుపైగా అలా బతికిన నాగసాకికి వయసు పైబడ్డంతో అక్కడుండడం మంచిదికాదని అధికారులు 2018లో ఇసిగాకి పట్టణానికి పట్టుకొచ్చి షెల్టర్ హోంలో పడేశారు. కరోనా టైంలో రోజులు లెక్కపెట్టూ నాలుగేళ్లు గడిపిన పెద్దాయన మళ్లీ ద్వీపానికి వెళ్లిపోతానన్నాడు. కన్నీళ్లతో కాళ్లావేళ్లా పడ్డంతో అధికారులు చలించిపోయి సరేనన్నారు. అతణ్ని ఈ నెల(జూన్) 16న భద్రంగా మళ్లీ ఒకినవా ద్వీపానికి తీసుకెళ్లారు. నాగసాకిని తాత్కాలికంగానే పంపామని, కొన్నాళ్లు అక్కడే ఉంచి ద్వీపానికి ‘ఫేర్ వెల్’ చెప్పించాక మళ్లీ పట్టుకొస్తామని అధికారులు చెబుతున్నారు. అతని ఆరోగ్యం బాగాలేదని, మానసిక ప్రశాంతత కోసం అలా టూరుకు పంపినట్లు పంపామంటున్నారు.