పార్లమెంట్‌లో హెల్మెట్‌ పెట్టుకున్న ఎంపీలు.. - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంట్‌లో హెల్మెట్‌ పెట్టుకున్న ఎంపీలు..

November 29, 2019

పాఠశాల భవంతి పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని ఓ టీచర్ హెల్మెట్ పెట్టుకొని పాఠాలు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా జపాన్ ఎంపీలు పార్లమెంట్‌లో హెల్మెట్‌లు ధరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయానికి వస్తే.. జపాన్ దేశంలో భూకంపాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎంపీలు తమ ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన నియమాలపై ఇటీవల ఎర్త్‌క్వేక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోల్డబుల్ హెల్మెట్లను ఆవిష్కరించారు. 

మడిచేందుకు అనువుగా ఉండే ఈ హెల్మెట్లను బ్యాగుల్లో కూడా పెట్టుకోవచ్చు. భూకంపం రాగానే వాటిని తెరిచి తలకు ధరిస్తే చాలు, ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ సందర్భంగా జపాన్ స్పీకర్ తడమోరీ ఒషిమా మాట్లాడుతూ..‘పార్లమెంటులో ఉన్నప్పుడు భూకంపం వస్తే.. మీ డెస్కుల్లో ఉండే ఈ హెల్మెట్లు ధరించండి. ఆందోళన చెందవద్దు. పార్లమెంటులో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి’ అని సూచించారు. జపాన్ పార్లమెంటులో భూకంపాల నుంచి ఎంపీలను కాపాడేందుకు 2017న సేఫ్టీ కిట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ కిట్‌లో తాజాగా ఫోల్డింగ్ హెల్మెట్‌ను అందుబాటులోకి తెచ్చారు.