అసోం అల్లర్లు...జపాన్ ప్రధాని పర్యటన రద్దు! - MicTv.in - Telugu News
mictv telugu

అసోం అల్లర్లు…జపాన్ ప్రధాని పర్యటన రద్దు!

December 13, 2019

Japan Prime Minister

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోం రాష్ట్రంలో ఈ ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసోం అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ణప్తిని కూడా పట్టించుకోకుండా అసోం ప్రజలు ఆందోళన చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తన భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం బంగ్లాదేశ్ విదేశాంగశాఖ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలుబడిన ఒక్కరోజు కూడా కాకముందే జపాన్ ప్రధానమంత్రి షింజో అబే కూడా భారత పర్యటన రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం జపాన్ ప్రధాని భారత పర్యటన మొదలవుతుంది. డిసెంబర్-15,2019న అసోం రాజధాని గౌహతిలో జరగనున్న వార్షిక ఇండియా-జపాన్ సమ్మిట్‌లో భారత ప్రధాని జపాన్ ప్రధాని సమావేశం కావాల్సి ఉంది. ప్రస్తుతం గౌహతి సహా మొత్తం అసోం ఆందోళనలతో తగలబడుతోంది. దీంతో షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకునే ఆలోచన చేస్తున్నట్లు జపాన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జపాన్ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు సమాచారం లేదని గురువారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.