సామాన్యుడికి రాకుమారి ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్యుడికి రాకుమారి ఫిదా

September 4, 2017

రాజకుమారి పేదవాడైన తోటరాముడ్ని ప్రేమించిన కథలు మనకు తెలుసు. గాఢమైన ప్రేమకు ఆస్తులు, అంతస్తులు అడ్డురావని చాలా ప్రేమకథల్లోనూ చూశాం. అయితే చాలా కథలు విషాదాలుగా మిగిలిపోతుంటాయి. కానీ జపాన్ రాకుమారి మకో ప్రేమ కథ మాత్రం సక్సెస్ అయింది. మకో.. ఓ అతి సామాన్య యువకుడైన కొమెరోను ప్రేమించింది. అతణ్నే పెళ్లాడతానని పట్టుపట్టింది. రాచకుటుంబం ఒప్పుకోక తప్పిలేదు. వీరిద్దరి నిశ్చితార్థం ఆదివారం టోక్యోలో ఘనంగా జరిగింది. కొమెరో ఓ ప్రైవేటు కంపెనీలో లీగల్ అసిస్టెంట్.  ‘కొమెరో నవ్వుకు పడిపోయాను. ఆ నవ్వు సూర్యకాంతిలా వెలుగునిస్తుంది’ అని చెప్పింది రాకుమారి సిగ్గుతో. వచ్చే ఏడాది మధ్యలో వీరి పెళ్లి కానుంది. రాకుమార్తె ఓ సామాన్య యువకుణ్ని పెళ్లాడబోతోందన్న వార్త జపనీయులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ మధ్య జపాన్ రాచకుటుంబంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. మామాలుగా ఏ దేశ రాజైనా, ఏ దేశ రాణి అయినా చచ్చేదాకా సింహాసనాన్ని అట్టిపెట్టుకుని ఉంటారు. ఉదాహరణకు బ్రిటన్ రాణి ఎలిజబెత్. ఆమెకు 90  ఏళ్లు దాటాయి. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే వృద్ధాప్యం వల్ల తాను చక్రవర్తి పదవి నుంచి తప్పుకుంటానని, తన వారసునికి సింహాసనం ఇస్తామని జపాన్ చక్రవర్తి అకిహిటో గత ఏడాది ప్రకటించారు.