బుమ్రానా మజాకా.. కొడితే వికెట్ విరిగిపోవాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

బుమ్రానా మజాకా.. కొడితే వికెట్ విరిగిపోవాల్సిందే..

November 26, 2019

Jasprit Bumrah is back to being best, shares photo of broken middle stump during practice

వెన్ను గాయం కారణంగా గత రెండు నెలలుగా పరుపు మీద విశ్రాంతి తీసుకున్న భారత ఫాస్ట్ బౌలర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్ బుమ్రా నిద్ర లేచిన పులి అయ్యాడు. ఈ 60 రోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్న కసిని వికెట్ మీద చూపించాడు. ఇటీవలే ఫిటెనెస్ సాధించి మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌లో అతను వేగంగా విసిరిన బంతికి మిడిల్ స్టంప్‌ బలైంది. పై భాగంలో విరిగిపోయింది. ఈ నేపథ్యంలో తన ప్రతాపాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు బుమ్రా. 

ఆ స్టంప్ ఫోటోని తాజాగా బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డిసెంబర్ 6 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. బుమ్రాకు అవకాశం ఇవ్వకుండా గత వారం సెలెక్టర్ల కమిటీ జట్టుని ప్రకటించింది. వెన్ను గాయం కావడంతో మరికొన్ని రోజులు అతనికి విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతను రీఎంట్రీ ఇస్తే మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లలో ఎవరో ఒకరు జట్టు నుంచి తప్పుకోక తప్పదు.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌ పర్యటనకి రాబోతోంది. ఈ రెండు జట్ల మధ్య జనవరి 14 నుంచి 19 వరకూ మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌‌‌‌తో బుమ్రా మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

కాగా, బుమ్రా ఇప్పటి వరకు భారత్ తరఫున 12 టెస్టులు, 62 వికెట్లు ఆడాడు. 58 వన్డేల్లో 103 వికెట్లు, 42 టీ20 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. గత మూడేళ్లలో టీమిండియా అగ్రశ్రేణి బౌలర్‌గా అదరగొడుతున్నాడు బుమ్రా.