సెలబ్రిటీలు తాము నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్లకు ఇబ్బంది కలగని వార్తలు మాత్రమే కోరుకుంటారు. వారిలో మరికొందరు మరింత వెరైటీ. తమను పట్టించుకోవడం లేదని మీడియాను ఆడిపోసుకుంటూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, నటి, రాజకీయ నాయకురాలు జయా బచ్చన్‌కు ఫోటో జర్నలిస్టులపై పిచ్చ కోపమొచ్చింది. ‘‘నా ఫోటోలు తీయొద్దు. చెబితే అర్థం కాదా, ఇంగ్లిష్ రాదా? వీళ్లను ఉద్యోగాల నుంచి పీకి పారెయ్యాలి,’’ అని కసురుకుంది. తన ఫొటోలు తీయబోయిన జర్నలిస్టులపై గయ్యాళిలా విరుచుకుపడింది. దీనిపై నెటిజన్లు నానా కామెంట్లు పెడుతున్నారు.
ఆమె ప్రైవసీని గౌరవించాలని కొందరు అంటుంటే, మరికొందరు ఆమెకు పొగరెక్కువ అని తిడుతున్నారు. ‘ముసలావిడే కదా, పెద్ద హీరోయిన్ అయినట్లు ఆ పోజులేమిటి? కుర్ర హీరోయిన్లే అభిమానులతో, ఫొటోగ్రాఫర్లతో చక్కగా మసలుకుంటారు, ఈమెకేమైంది?’ అని మరికొందరు అంటున్నారు. ఆమెతో పోలిస్తే రేఖ చాలా బెటర్ అంటూ మరికొందరు పాత విషయాలేవో చెబుతున్నారు. జయ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అమితాబ్‌తో కలసి వెళ్లినప్పుడు ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగింది. అమితాబ్ బచ్చన్ ఫోటోలు తీసిన ఫొటోగ్రాఫర్లు ఆమె ఫోటోలు కూడా తీయబోగా ఫైర్ అయిపోయింది. అమితాబ్ మౌనంగా ఉండిపోయారు. జయా బచ్చన్ గతంలోనూ విలేకర్లపై చాలాసార్లు నోరు చేసుకున్నారు.