జనం గుండెల్లో జయరాజ్ పాటలు...! - MicTv.in - Telugu News
mictv telugu

జనం గుండెల్లో జయరాజ్ పాటలు…!

August 14, 2017

రక్తం ఉడికి,కడుపు రగిలిన తనం ఆయన పాటలలో కనిపిస్తది ,పల్లెపాటలను ఒళ్లంతా నింపు కున్న మర్మయోగి, ప్రజావాగ్గేయకారుల్లో పదునెక్కిన గొంతుక ఆయనది,కల్మశం లేని ఆయన కలం నుంచి జాలువారే పాటలు జీవనదిలా సాగిపోతుంటాయి. ప్రజల గుండెల్లో చిరకాలం యాదికుండే పాటలు రాసిండు జయరాజు..తెలంగాణ ప్రభుత్వం సాహితీ అవార్డుతో జయరాజ్ ను సత్కరించనున్నారు.

పాటగానే పుట్టి పాటల్లో పదంలా బతికాలన్నదే ఆయన ఆశ..శ్వాస. ఆయన కలం నుంచి తొణికిన ప్రతి పదమూ పాటై పలికింది.తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు “ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట  ఆయన కలం నుంచి పట్టిన తొలి పల్లవి. కాచినపల్లి ఎన్‌కౌంటర్‌ పై రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ పాట విన్న ఏ తల్లికైనా… ఏ చెల్లి కైనా కన్నీటి చెమ్మ రావడం ఖాయం. “ ఎక్కడ ఉన్నారో అన్నలు… యాడా ఉన్నారో… నింగీలోన తొంగి చూసే చుక్కలైనారో..’ ఈ పాట జయరాజును ప్రపంచానికి పరిచయం చేసింది.

చెలకల్లో లేని నీళ్లు రైతు కళ్లల్లో చూసి.. జయరాజు రాసిన వానమ్మ పాట కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోన, పని పాటల్లోనూ కష్టజీవికి తోడైనిలిచింది. నీల్లోసుకున్న కంకి నీళ్లాడలేక పాయే అన్న ఆయన పదాలు ఎంతటి మనిషినైనా కదిలిస్తాయి.చెంగు చెంగున ఎగిరే కోడె దూడలు కటికోడి కొట్టుకు చేరుతున్నయని వలపోస్తడు జయరాజు. వంద మాటల కంటే ఒక పాట చాలా గొప్పదన్న స్పృహ ఉన్నోడు కాబట్టే…పాట జనం నాడి పట్టుకొని… దశాబ్దాలు గడిచిన వన్నెతరగని పాటలు రాసిండు. అనేక ఉద్యమాలకు సాంస్కృతిక సైనికుడై పనిచేసిండు

తెలంగాణ బతుకు ఛిధ్రమైన జాడను పాటల్లో పట్టి చూపించిండు. పోరాడకుంటే బతుకు మారదని, ప్రజలకు దోపిడి మర్మాన్ని విప్పి చెప్పిండు. జయరాజు పాటలు ప్రజలను ఉద్యమ బాటలో నడిపిస్తయి. జయరాజు రాసిన పాటలు అక్షర దీపాలైనయ్‌.ఆరిపోని నిప్పు కణికలైనయి.ఇంకేమి మారిందరా అని తెలంగాణ గోసను పాటగా ప్రశ్నించే తీరుకు ఒంటి మీది రోమాలు కత్తులవుతాయి. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పాలకుల పీడనవంటి దీర్ఘకాలిక సమస్యలను పాటగట్టి జనాన్ని పోరుబాట పట్టిచ్చిండు.పల్లె గురించి, తల్లి గురించి,ఉద్యమం గురించి, అక్షరం గురించి, ప్రభుత్వ దుర్మార్గాల గురించి…పడావుపడ్డ భూముల గురించి విభిన్నమైన వస్తువులతో పాటలల్లిన ఘనత జయరాజుది. అంతేకాదు వివాహ వ్యవస్థలో లోపాలను, స్త్రీ పడే జీవితకాలపు వేదనను పదాలకు ఎక్కించిన ఉద్యమ గొంతుక జయరాజు.