జయహో జగనన్నా..ట్రాక్టర్ నడిపిన జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

జయహో జగనన్నా..ట్రాక్టర్ నడిపిన జగన్

June 7, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాలో నేడు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌ను నడిపిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. గుంటూరులో మంగళవారం ఆయన వైఎస్సార్‌ యంత్రసేవా పథకాన్ని ప్రారంభించి, రాష్ట్రస్థాయి మెగా పంపిణీని చేపట్టారు. పంపిణీలో భాగంగా రైతు గ్రూపులతో కలిసి ఆయన ట్రాక్టర్ నడిపారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాలను పంపిణీ చేస్తామని ప్రకటించిన విధంగానే ఈరోజు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

 

జగన్ మాట్లాడుతూ..”ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రాంభించాం. రైతన్నకు ప్రతి అడుగులో అండగా ఉంటున్నాం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రూ. 2,016 కోట్లతో 10,750 వైయస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. 3,800 కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నాం. ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అవినీతి లేకుండా ఏ రకంగా వ్యవస్ధను క్లీన్‌ చేస్తున్నామో, గమనించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా చూడండి. ఇవాళ 175 ట్రాక్టర్ల మోడళ్లలో రైతులకు నచ్చిన మోడల్‌ కొనుగోలు చేసే అవకాశం ఇచ్చాం” అని ఆయన అన్నారు.