తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న ‘వేద నిలయం’ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి తమిళ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసింది. జయలలిత మరణం తరువాత ఆ బంగ్లాలో ఆమె సన్నిహితురాలు శశికళ కొన్నాళ్లు ఉన్నారు. శశికళ జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ బంగళా ఖాళీగా ఉంది.
ఈ నేపథ్యంలో ‘వేద నిలయం’ బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వ ఆర్డినెన్స్ వెలువడింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సంతకం చేశారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని సమాచారం. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే మ్యూజియం పనులు ప్రారంభం అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వస్తువులు, సమాచారాన్ని ఇందులో భద్రపరచనున్నారు.