సహజనటి జయసుధ మూడో పెళ్లి చేసుకున్నారంటూ ఇటీవల కొన్ని ఫోటోలు మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. వారసుడు ప్రిరిలీజ్ ఈవెంట్లో కూడా ఓ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకున్నారు. కానీ ఆ వార్తలను ఖండించారు సహజనటి. అతను అమెరికా నుంచి తన జీవిత చరిత్ర తీయడానికి వచ్చిన వ్యక్తి అని స్పష్టం చేశారు. తనకు దక్కుతున్న గౌరవాన్ని ప్రత్యక్షంగా గమనించేందుకు తనను ఫాలో అవుతున్నాడని వెల్లడించింది. ‘అతని పేరు ఫెలిపే రూయేల్స్. నా స్పిరిట్యువల్ బయోపిక్ తీస్తున్నారు.
అంటే నేను క్రిస్టియన్ గా ఎలా మారాను? ఆ తర్వాత ఏం జరిగింది? మారక ముందు ఎలా ఉండేదాన్ని? ఇవన్నీ అందులో ఉంటాయి. నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ లో అన్నీ చదివి తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ ఎలా సాగుతున్నాయి? వంటి వివరాలు తెలుసుకునేందుకు నాతో ట్రావెల్ అవుతున్నాడు. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఈ మధ్యే అమెరికా వెళ్లి అతడిని కలిశాను’ అని వెల్లడించారు. కాగా, కొన్నేళ్ల కింద బ్యాంకాక్ లో నీటిలో పడిపోయినప్పుడు జయసుధకు జీసస్ కనిపించారట. నీటి అడుగుకు వెళ్లినా కనీసం ముక్కులోకి కూడా నీరు పోకపోవడంతో బతికి బయటపడ్డారు. ఇదొక మిరాకిల్, సూపర్ నేచురల్ అని భావించిన జయసుధ.. తర్వాత క్రిస్టియానిటీని స్వీకరించారు. ఇదికాక, ఇప్పటికే జయసుధ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.