తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై టార్గెట్గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని వైసీపీ ఆఫీస్గా మార్చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి భీమవరంలో పోటీచేసేందుకు డీఎస్పీ చూస్తున్నారని ఆరోపించారు. అందుకు ఇప్పటినుంచి వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమంగా ఇసుకు వ్యాపారాన్ని చేస్తున్నారన్నారు. మా వాళ్లపై 861 మందిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. అంతేకాకుండా ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ఏజెంట్గా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని..ఆయన అక్రమాలను వదిలేది లేదని జేసీ హెచ్చరించారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదని… చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని స్పష్టం చేశారు.