దేశవ్యాప్తంగా వున్న ట్రిపుల్ ఐటీ, నిట్‌లలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్– 2023 ఆన్లైన్ తొలి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో బీఈ, బీటెక్ విభాగాల్లో జరుగుతాయి. తొలి పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం షిఫ్టులో బీఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో పేపర్–2ఏ, 2బీ పరీక్షలు నిర్వహిస్తారు. జరిగే ఈ పరీక్షల కోసం సన్నద్ధమైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/నుంచి ఎప్పటికప్పుడు తమ అడ్మిట్ కార్డులు(Admit cards) డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ(National testing agency) అధికారులు సూచించారు. మెయిన్స్‌లో అర్హత సాధిస్తే అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతిస్తారు. అడ్వాన్స్డ్ పరీక్ష ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయని పరీక్షల నిర్వాహకులు వెల్లడించారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇవి మరిచిపోవద్దు..
పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా హాల్ టికెట్‌ను తమ వెంట తీసుకొని వెళ్లాలి. ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష హాలులోకి అనుమతించరు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పట్టుకెళ్లాలి. పాస్‌పోర్టు సైజ్ ఫొటో కూడా చాలా ముఖ్యం. మీరు ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో అలాంటి ఫొటోను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది. దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ట్రాన్స్పరెంట్గా ఉండే బాల్‌పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి.
ఈ వస్తువులు మాత్రం అస్సలు తీసుకెళ్లద్దు
పరీక్షకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులతోపాటు తీసుకెళ్లని వస్తువులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే.. జామెట్రీ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.మహిళ విద్యార్థులకు వీటితోపాటు నగలు, మెటాలిక్ వస్తువులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు
ఇక ఏదైనా హెల్త్ ఇష్యూస్ .. షుగర్ వంటి సమస్యలతో బాధపడే విద్యార్థులైతే షుగర్ టాబ్లెట్స్, పండ్లు వంటివి వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు. చాక్లెట్లు, క్యాండీ,శాండ్విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహారపదార్థాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.